: 80 కోట్ల మంది యువత కలే భారత భవిష్యత్తు: మోదీ
21వ శతాబ్దాన్ని ఇండియా ఏలుతుందని, 35 ఏళ్లలోపు వయసున్న 80 కోట్ల మంది భారత యువత కనే కలలే భారత భవిష్యత్తని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్ పర్యటనకు వచ్చిన ఆయన, శ్రీమాతా వైష్ణోదేవీ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. తదుపరి శతాబ్దాన్ని 'సెంచరీ ఆఫ్ నాలెడ్జ్' (విజ్ఞాన శతాబ్ది)గా అభివర్ణించిన మోదీ, నేటి యువత మనసులో 'తరువాత ఏం చేయాలి?' అన్న ప్రశ్న ఉదయించడమే దేశాభివృద్ధికి సంకేతమని అన్నారు. "మీ తల్లిదండ్రులు మీకోసం ఏం చేశారో గుర్తు చేసుకోండి. మీకోసం వారెన్నో త్యాగాలు చేశారు. సంతోషాన్ని వదిలేసుకున్నారు. ఇక ఆ సంగతులు మరచిపోండి. గతాన్ని వదిలేసి మీరు ఏం సాధించారో ఓ సారి చూసుకోండి. పేదలకు ఏదో ఒకటి చేస్తామన్న ప్రతిన బూనండి. ఈ యూనివర్శిటీని నిర్మించింది పేద భక్తులు అమ్మవారికి ఇచ్చిన కానుకలతోనే అని గుర్తించండి. దేశంలోని మిగతా వర్శిటీలు పన్ను చెల్లింపుదారుల సహకారం, తల్లిదండ్రులు ఇస్తున్న ఫీజులతో నడుస్తుంటే, ఇదొక్కటి మాత్రమే లక్షలాది మంది వైష్ణోదేవి భక్తులిస్తున్న డబ్బుతో నడుస్తోంది" అన్నారు. ఈ సందర్భంగా మోదీ, మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయన వర్శిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కలాం ఆశయాలను నేటి యువత సాధించాలని పిలుపునిచ్చారు.