: మారిన రూల్స్... ప్రభుత్వ ఉద్యోగులకూ వృద్ధాప్య పింఛన్లు... ఇంటికి, వైద్యానికి, విద్యకు, పెళ్లికి కూడా పీఎఫ్ విత్ డ్రా
ఇండియాలో భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాలు కలిగివున్న వేతన జీవులందరికీ ఊరట కలిగించే నిర్ణయమిది. పీఎఫ్ విత్ డ్రా నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్టు ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ట్రస్టీలు ప్రకటించారు. మారిన నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతాదారు ఇల్లు కొనాలన్నా, తనకు లేదా తన కుటుంబ సభ్యులకు క్షయ, కుష్టు, పక్షవాతం, క్యాన్సర్, హృద్రోగాలు వంటి వాటికి వైద్యం చేయించాల్సి వచ్చినా, పిల్లల పెళ్లి లేదా పై చదువులకు డబ్బు అవసరమైనా మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారు, ప్రభుత్వాలు అందించే వృద్ధాప్య పెన్షన్లనూ అందుకోవచ్చు. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. కాగా, బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా పీఎఫ్ ఖాతాలో కంపెనీ యజమాని వాటాను 58 ఏళ్ల తరువాత మాత్రమే విత్ డ్రా చేసుకునేలా కొత్త నిబంధనలు రాగా, వాటిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. వస్తున్న వ్యతిరేకతను చూసిన కేంద్రం నష్టనివారణ చర్యల్లో భాగంగా నిబంధనలు మార్చింది.