: వెస్టిండీస్ కూడా అంగీకరించలేదు...పాక్ కు షాక్
పాకిస్థాన్ లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆర్థికంగా పరిపుష్టిని చేసి అంతర్జాతీయ క్రికెట్ లో సత్తాచాటాలని భావిస్తున్న పీసీబీ ఆశలు ఆవిరవుతున్నాయి. షార్జాలో మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా లాభాల సంగతటుంచి, ఎంతో శ్రమపడాల్సి వస్తోందని పీసీబీ వాపోతోంది. 2009లో శ్రీలంక జట్టుపై లాహోర్ లో జరిగిన తీవ్రవాద దాడి తరువాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదు. దీంతో షార్జా వేదికతో ఎంతో క్రేజ్ తో కూడిన భారత్ తో సిరీస్ నిర్వహించేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే బీసీసీఐ అందుకు నిరాకరించడంతో పీసీబీ ఆశలు ఆవిరయ్యాయి. అనంతరం పలు దేశాలతో ఆడేందుకు ప్రణాళికలు రచించింది. అందులో కొన్ని సత్ఫలితాలివ్వగా, తాజాగా వెస్టిండీస్ జట్టు పాక్ జట్టుతో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కొన్ని మ్యాచ్ లు పాకిస్ధాన్ లో ఆడాలని పీసీబీ విండీస్ బోర్డుకు సూచించింది. అయితే అందుకు విండీస్ బోర్డు అంగీకరించలేదు. ఆటగాళ్ల భద్రతే తమ లక్ష్యమని, పాకిస్థాన్ లో తమ ఆటగాళ్ల భద్రతకు భరోసా లేదని స్పష్టం చేస్తూ, పాకిస్థాన్ లో ఆడలేమని స్పష్టం చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విండీస్ బోర్డు నిర్ణయంతో పీసీబీ షాక్ కు గురైంది.