: అమరావతిలో మరో కీలక నిర్మాణానికి అడుగు!... సీడ్ యాక్సెస్ రోడ్డుకు టెండర్లు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు శరవేగంగా జరుగుతుండగా, రాజధాని ప్రాంతాన్ని చెన్నై-కోల్ కతా జాతీయ రహదారితో కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సీఆర్డీఏ అధికారులు శ్రీకారం చుట్టారు. మొత్తం 21.5 కిలో మీటర్ల పొడవుండే ఈ రోడ్డును రెండు ప్యాకేజీలుగా విభజించిన అధికారులు తొలి ప్యాకేజీకి టెండర్ ప్రకటనను జారీ చేశారు. 18.3 కిలో మీటర్ల పొడవున్న ఈ ప్యాకేజీకి రూ.240 కోట్ల అంచనాతో టెండర్ ప్రకటనను జారీ చేసిన అధికారులు.. రెండు వారాల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో కృష్ణా నది ఒడ్డున కనకదుర్గమ్మ గుడి నుంచి ప్రారంభమయ్యే ఈ రోడ్డు... ఉండవల్లి, వెంకటపాలెం, మోదుగులంకపాలెం, కోర్ కేపిటల్, రాయపూడి, దొండపాడుల మీదుగా బోరుపాలెం వద్ద ముగుస్తుంది. ఇక ఈ రోడ్డులో రెండో ప్యాకేజీగా విభజించిన రోడ్డు పొడవు 3.2 కిలో మీటర్లు. మొత్తం ఆరు లేన్లలో మధ్యలో మెట్రో, బీఆర్జీఎస్ తో నిర్మితం కానున్న ఈ రోడ్డు మొత్తం అంచనా వ్యయం రూ.540 కోట్లుగా అధికారులు తేల్చారు. అయితే ప్రస్తుతం తొలి ప్యాకేజీ పనులను నాలుగు లేన్లకే పరిమితం చేస్తూ టెండర్ జారీ చేశారు. మిగతా పనులను దశలవారీగా చేపడతారు.

  • Loading...

More Telugu News