: కాళ్లపై పడ్డా నాణ్యత విషయంలో మంత్రి రాజీపడలేదు
నిర్మాణ పనులను ఎత్తిచూపిన మహిళా మంత్రి కాళ్లను కాంట్రాక్టర్ పట్టుకోవడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. శివపురిలో నిర్మించిన 120 పడకల ఐటీఐ హాస్టల్ భవనాన్ని ప్రారంభించేందుకు మధ్యప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి జశోధర సింధియా వెళ్లారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె హాస్టల్ లో కలియదిరిగారు. ఈ సందర్భంగా హాస్టల్ ను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్మాణం నాసిరకంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులకు తగ్గ పనులు జరగలేదని ఆరోపించిన ఆమె, ఈ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేసి, ప్రారంభోత్సవం నిర్వహించాలని సూచించారు. దీంతో హాస్టల్ నిర్మించిన కాంట్రాక్టర్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె శాంతించలేదు. నిధులకు తగ్గ పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.