: కోటి కారుపై వెనక్కి తగ్గిన యెడ్డీ
కోటి కారుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప వెనక్కి తగ్గారు. తన అనుచరుడు, వ్యాపారవేత్త మురుగేష్ నిరానీ బహుమతిగా ఇచ్చిన కోటి రూపాయల లగ్జరీ కారుపై విమర్శలు రావడంతో ఆయన ఇచ్చిన కారును ఆయనకే తిరిగి ఇచ్చేశారు. ట్రైన్ లో వెళ్లి కరవు ప్రాంతాల ప్రజలను పరామర్శిస్తానని యడ్యూరప్ప తెలిపారు. కాగా, బీజేపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు మరోసారి చేపట్టిన యెడ్డీ కరవు ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. మండే ఎండల్లో పార్టీ అధ్యక్షుడు పర్యటించడం కష్టమని భావించిన ఆయన వీర విధేయుడు మురుగేష్...ఆయనకు కోటీ పదిహేను లక్షల రూపాయల విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును బహుమతిగా అందజేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రైతులు కరవుతో అల్లాడుతుంటే వారు లగ్జరీ కారులో పర్యటించడం ఏంటని విమర్శలు రేగాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు.