: దేవినేని ఓ దద్దమ్మ: వైకాపా అధికార ప్రతినిధి జోగి రమేష్
కృష్ణా నదిని నమ్ముకున్న ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర అన్యాయం జరిగేలా తెలంగాణ సర్కారు కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఏపీ సర్కారు తీవ్రంగా విఫలమైందని వైకాపా అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. నీటి పారుదల శాఖా మంత్రి దేవినేనిని ఓ పెద్ద దద్దమ్మగా అభివర్ణించిన ఆయన, మీడియా సమావేశాల్లో సొల్లు కబుర్లు చెబుతూ, కేసీఆర్ అక్రమ ప్రాజెక్టులపై స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ నుంచి చంద్రబాబును తరిమికొట్టేందుకు ఓటుకు నోటు కేసును కేసీఆర్ వాడుకున్నారని, ఆ కేసుపై భయంతో చంద్రబాబునాయుడు, ఏ కోశానా కేసీఆర్ కు అడ్డుపడలేకపోతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి పథకాల వల్ల 150 టీఎంసీల నీరు తరలిపోతుందని, ఇంత అన్యాయం కృష్ణా డెల్టా రైతులకు జరుగుతున్నా, బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణం కృష్ణా బోర్డు, కేంద్రం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి, భవిష్యత్తులో ఏపీ రైతులకు నష్టం కలుగకుండా చూడాలని రమేష్ డిమాండ్ చేశారు.