: షాకింగ్... రైల్వే శాఖలో సీనియర్ల కన్నా జూనియర్లకు అధిక వేతనాలు!
ఎంతో మంది రైల్వే ఉద్యోగుల గుండెలను పిండేస్తున్న బాధ ఇది. ఎంతో అనుభవం, సీనియారిటీ ఉండి కూడా, జూనియర్ల కన్నా తక్కువ వేతనాలను అందుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయమై డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి కల్పించుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని రైల్వే బోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని ఆరోపించింది. కాగా, కొన్ని సాంకేతిక కారణాలు, విద్యార్హతల కారణంగా ఒకే విభాగంలో ఒకే ర్యాంకులో ఉన్న జూనియర్లకు అధిక వేతనాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్లు జరిగిన వేళ, జూనియర్లు అధికంగా వేతనాన్ని పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పుడు 7వ వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే, వీరి వేతనాల మధ్య తేడా మరింతగా పెరుగుతుందని సమాచారం. ఉద్యోగుల బేసిక్ వేతనంలో ఉన్న వ్యత్యాసమే ఇందుకు కారణం. ఇదిలావుండగా, రైల్వే శాఖలో వేతనాల సర్దుబాటు, సీనియర్లకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ విభాగం చర్యలను ప్రారంభించినట్టు తెలుస్తోంది.