: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానం టేకాఫ్... శంషాబాద్ లో ఆందోళన
టికెట్లను కొనుగోలు చేసి, ప్రయాణ సమయానికన్నా ముందే ఎయిర్ పోర్టుకు వచ్చినప్పటికీ, తమను ఎక్కించుకోకుండానే విమానం వెళ్లిపోయిందంటూ, పలువురు ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. నేటి ఉదయం ఇండిగో విమానంలో హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన విమానం షెడ్యూల్ సమయం కన్నా ముందే బయలుదేరినట్టు తెలుస్తోంది. దీంతో విమానం ఎక్కలేకపోయిన ప్రయాణికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. టికెట్లు ఉన్నప్పటికీ, తమను ఎక్కించుకోలేదని నిరసన చేశారు. దీంతో వారిని శాంతింపజేసేందుకు ఎయిర్ పోర్టు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిని తదుపరి విమానంలో కొచ్చి చేరుస్తామని చెప్పిన ఇండిగో అధికారులు, విమానం ముందుగానే ఎందుకు బయలుదేరిందన్న విషయాన్ని వెల్లడించలేదు.