: సాఫ్ట్ వేర్ ను తస్కరించిన కేసులో టీసీఎస్ కు రూ. 6 వేల కోట్ల జరిమానా
టాటా గ్రూప్ లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ పై 'ఎపిక్ సిస్టమ్స్' దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగిలింపు కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు 940 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు) జరిమానా విధించగా, దాన్ని పై కోర్టులో సవాల్ చేస్తామని టీసీఎస్ వెల్లడించింది. తమకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను, డాక్యుమెంట్ల సమాచారాన్ని, డేటాను, సాఫ్ట్ వేర్ ను టాటా అమెరికా ఇంటర్నేషనల్ దొంగిలించిందన్నది ఎపిక్ సిస్టమ్స్ వాదన. దీనిపై విచారించిన న్యాయస్థానం, ఆరోపణలు వాస్తవమని ప్రకటించింది. అక్టోబర్ 2014లో ఈ కేసు దాఖలు కాగా, తమ అనుమతి లేకుండానే టీసీఎస్ ఉద్యోగులు సాఫ్ట్ వేర్ ను వాడుకున్నారని కూడా ఎపిక్ సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. ఇండియాలో పనిచేస్తున్న టీసీఎస్ ఉద్యోగి ఒకరు ఏకంగా 6,477 డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకున్నాడని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఊహించలేదని, దీనిపై 30 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానానికి అపీలు చేసుకునే సదుపాయం తమకుందని, ముంబైలోని టీసీఎస్ ఉన్నతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.