: ఈసారి నాలుగు 'అవతార్'లతో సందడి చేయనున్న జేమ్స్ కెమెరాన్
జేమ్స్ కెమెరాన్ కీర్తి ప్రతిష్ఠలను 'టైటానిక్' అమాంతం పెంచేస్తే, దానిని 'అవతార్' జగద్విదితం చేసింది. ఈ 'అవతార్'కు సీక్వెల్ తయారు చేసే పనిలో జేమ్స్ కేమెరాన్ ప్రస్తుతం నిమగ్నమయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలతో సీక్వెల్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని ఆయన తెలిపాడు. తొలుత మూడు భాగాల్లో 'అవతార్'ను పూర్తి చేద్దామని భావించామని, స్క్రిప్టు వర్కు జరగుతుండగా దాని నిడివి పెరిగిపోయిందని, దీంతో నాలుగు భాగాలుగా తీయనున్నామని ఆయన చెప్పారు. 'అవతార్' తొలి సీక్వెల్ 2018 వేసవిలో విడుదలవుతుందని ఆయన వెల్లడించారు. తరువాతి సీక్వెల్స్ ను 2020, 2022, 2023 సంవత్సరాల్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 'అవతార్' ను మించే విధంగా 'అవతార్ సీక్వెల్స్' లో కొత్త పాత్రలు, కొత్త పరిస్థితులు, కొత్త లోకాలు, కొత్త సంప్రదాయాలు, కొత్త సమస్యలు, కొత్త పరిష్కారాలు, కొత్త పోరాటాలు అభిమానులను అలరిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. సాక్షాత్తూ జేమ్స్ కేమెరాన్ స్వయంగా ఇలా వెల్లడించడంతో 'అవతార్ సీక్వెల్స్'పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.