: గుర్గావ్ తరువాత... షిమ్లాను 'శ్యామ్లా'గా మార్చాలని ఒత్తిళ్లు!
హర్యానా ప్రభుత్వం గుర్గావ్ పేరును గురుగ్రామ్ గా మార్చిన వేళ, హిమాచల్ ప్రదేశ్ రాజధానిగా, బ్రిటీష్ పాలన వేళ వేసవి రాజధానిగా విలసిల్లిన షిమ్లా పేరును శ్యామ్లాగా మార్చాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్ ఒత్తిడి తెస్తోంది. ఈ మేరకు హిమాచల్ గవర్నర్ కల్పించుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పేరు మార్చాలని వీహెచ్పీ కార్యదర్శి మనోజ్ కుమార్ కోరారు. షిమ్లాలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన డల్ హౌసీ (అధికారులు, సైనికుల విశ్రాంతి కేంద్రం) పేరును నేతాజీని గుర్తుకు తెచ్చేలా మార్చాలని, పూర్తిగా ధ్వంసమైన పీటర్ హోఫ్ ప్రాంతాన్ని పునరుద్ధరించి వాల్మీకి సదన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మరుసటి రోజు వీహెచ్పీ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఇక్కడి కొండలపై ఓ ఫకీరు నీలి రంగులో ఇంటిని నిర్మించగా ఈ ప్రాంతానికి శ్యామలా అని పేరు వచ్చిందని, ఆపై అది కాల క్రమంలో షిమ్లాగా మారిందని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది. శ్యామల అంటే కాళీమాత అనే అర్థం కూడా వుందని, ఈ నగరంలో కాళీమాత దేవాలయం కూడా వుందని మరి కొందరు అంటున్నారు.