: గుడివాడ అమర్ నాథ్ దీక్ష... గంటా, అయ్యన్నలకు క్లాస్ పీకిన చంద్రబాబు!
విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ దీక్ష ప్రారంభించడం, దీక్షకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించిన వేళ, జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు లను చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే అమర్ నాథ్ దీక్ష గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించిన చంద్రబాబు, దీక్ష చేసే వరకూ ఎందుకు రానిచ్చారని మందలించారట. ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని, జిల్లా వ్యవహారాలను గాలికి వదిలేశారని చంద్రబాబు క్లాస్ పీకినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసలు దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డ ఆయన, ఇప్పుడిక ఏమీ చేయలేమని, వదిలిపెడితే, జోన్ రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. జోన్ వస్తుందన్న సెంటిమెంటుతో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు సమాచారం.