: ‘నవమి’ శోభా యాత్ర ఎఫెక్ట్!... భాగ్యనగరిలో మద్యం విక్రయాలు బంద్
శ్రీరామ నవమిని పురస్కరించుకుని భాగ్యనగరి హైదరాబాదులో జరగనున్న శోభాయాత్ర మందు బాబులకు గడ్డు పరిస్థితులను తీసుకొచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా ఏటా హైదరాబాదులోని మంగళ్ హాట్ సీతారామస్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కోలాహలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దఫా కూడా ఈ యాత్రకు భారీ ఏర్పాట్లు జరిగాయి. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల కింద నగరంలో నేడు మద్యం విక్రయాలను బంద్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జంట నగరాల్లో మద్యం చుక్క దొరకదు.