: కరుణతో పెద్ద కొడుకు భేటీ!... మీడియాపై చిన్న కొడుకు చిందులు!
ఎన్నికల వేళ తమిళనాట చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తమ్ముడికి దక్కిన ప్రాధాన్యం తనకు దక్కలేదంటూ తండ్రిపై అలిగి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి... తిరిగి తన తండ్రి, డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెంతకు చేరుతున్నారు. గత వారంలో ఓ మారు తండ్రి ఇంటికి వచ్చిన అళగిరి దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. తాజాగా నిన్న ఉదయం కూడా అళగిరి తండ్రి వద్దకు వచ్చారు. ఇంటి బయట కారు దిగి నేరుగా ఇంటిలోకి వెళ్లిన అళగిరి... తండ్రితో దాదాపు పది నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అళగిరి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. అళగిరి వెళ్లిన తర్వాత బయటకు వచ్చిన ఆయన సోదరుడు, కరుణ చిన్న కొడుకు ఎంకే స్టాలిన్ ను మీడియా ప్రతినిధులు పలకరించారు. కరుణతో అళగిరి భేటీలో విశేషాలేంటంటూ ఆయనను ప్రశ్నించారు. అంతే, స్టాలిన్ ఒక్కసారిగా ఫైరయ్యారు. ‘‘అనవసర ప్రశ్నలు వేయొద్దు. నేను ప్రచార హడావిడిలో ఉన్నాను’’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు.