: విజయనగరంలోనూ వైసీపీ ఖాళీ?... టీడీపీ వైపు కురుపాం ఎమ్మెల్యే చూపు?


వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న వైసీపీకి విజయనగరం జిల్లాలో అసలు ప్రాతినిధ్యమే లేకుండాపోయే పరిస్థితి ఎదురుకానుంది. జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలుండగా, గడచిన ఎన్నికల్లో ఏడింటిలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు స్థానాలను వైసీపీ చేజిక్కించుకుంది. వైసీపీ ఖాతాలో పడ్డ స్థానాల్లో బొబ్బిలి (సుజయకృష్ణ రంగారావు), సాలూరు (రాజన్నదొర), కురుపాం (పుష్ప శ్రీవాణి) ఉన్నాయి. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు బేబి నాయన కూడా టీడీపీలో చేరనున్నారు. ఇక సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా పార్టీ మారే అవకాశాలున్నాయన్న పిడుగులాంటి వార్తతో బొబ్బిలి కోటకు వెళ్లిన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి... పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కొలగట్ల వీరభద్రస్వామి తదితరులతో కలిసి సాలూరు వెళ్లారు. అయితే కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని దొర ముఖం మీదే చెప్పేయడంతో నిరాశగానే విజయసాయి తిరుగు ముఖం పట్టక తప్పలేదు. ఇక అసెంబ్లీ లోపల, బయట జరుగుతున్న పార్టీ ఆందోళనల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటున్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. పుష్ప శ్రీవాణి టీడీపీలో చేరిపోతే... ఉత్తరాంధ్రలో కీలక జిల్లా అయిన విజయనగరంలో వైసీపీకి అసలు ప్రాతినిధ్యం గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.

  • Loading...

More Telugu News