: మోదీ కొత్త ఆలోచన 'నామ్'... రైతుల కోసం అమేజాన్ అంత పెద్ద ఈ-మార్కెట్!
రైతులకు మరింత లాభదాయక ధరను దగ్గర చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మొగ్గతొడిగిన ఆలోచన 'నామ్' (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్రారంభమైంది. ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫాంగా 8 రాష్ట్రాల్లోని 21 ప్రధాన మండీ (వ్యవసాయ మార్కెట్)లను, 585 రెగ్యులేటెడ్ హోల్ సేల్ మార్కెట్లను భాగం చేస్తూ, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మొదలైన ఈ సేవలను వినియోగించుకుని రైతులు లాభపడవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాదా మోహన్ సింగ్ తెలిపారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను పోటీ ధరలకు విక్రయించుకోవచ్చని, వినియోగదారులకు స్థిరమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు ఒకే ధరను అందించే ఆలోచనతో తయారైన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఈ నామ్. పారదర్శకమైన అమ్మకపు లావాదేవీలు, కమోడిటీలకు సరైన ధర కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని రాధామోహన్ సింగ్ తెలిపారు. కాగా, దేశంలో ప్రస్తుతం 7 వేలకు పైగా హోల్ సేల్ మార్కెట్లు ఉన్నాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ సహా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభమైన నామ్ సేవలను, తదుపరి దశల్లో అన్ని రాష్ట్రాలకూ విస్తరింపజేయాలన్నది కేంద్రం ఆలోచన. తొలి దశలో 12 రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఈ-మార్కెట్ విధానంలో చేర్చారు. వీటిల్లో వరి, గోధుమ, మొక్క జొన్న, పసుపు, ఉల్లిపాయలు, చింతపండు, ఆముదాలు, ఆవాలు, బీన్స్ తదితరాలను రైతులు ఈ-మార్కెట్ చేసుకోవచ్చు. ఫలానా సమయానికి తమ వద్ద పంట వస్తుందని వెల్లడిస్తే, దానికి వ్యాపారులు ధర నిర్ణయిస్తారు. నచ్చిన ధరకు పంటను అమ్ముకుని, సమయానికి డెలివరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ, అనుకోని దురదృష్టకర పరిస్థితిలో పంట నష్టం సంభవిస్తే, ముందే చేయించుకున్న బీమాతో గట్టెక్కవచ్చు. ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫాం పూర్తి స్థాయిలో విస్తరించిన తరువాత అతిపెద్ద ఆన్ లైన్ ట్రేడింగ్ సంస్థ అమేజాన్ అంత పెద్దది అవుతుందని నిపుణుల అంచనా.