: 50 ఏళ్ల వరకు క్రికెట్ ఆడుతానేమో అంటున్న 45 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్!
అంతర్జాతీయ క్రీడాకారుడి క్రీడా జీవిత కాలం 30 ఏళ్ల వయసు వరకు నిరాఘాటంగా సాగిపోతుంది. గాయాలతో సావాసం చేయగలిగితే 35 ఏళ్ల వరకు ఉత్తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల వరకు ఆటగాడిగా ఉత్తమస్ధాయిలో ఆకట్టుకోవడం చాలా కష్టమైన విషయం. అలాంటిది 45 ఏళ్ల వయసున్న ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రికెట్ ను ఆస్వాదిస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కు స్వస్తి చెప్పిన బ్రాడ్ హాగ్ అప్పటి తన నిర్ణయం తొందరపాటు చర్యగా భావిస్తున్నాడు. ఇన్నేళ్లు క్రికెట్ ఆటగాడిగా కొనసాగడం వెనుక తన రెండో భార్య ప్రోత్సాహం ఉందని చెబుతున్నాడు. మరో మూడేళ్లు ఆస్ట్రేలియా జట్టుకు ఆడే అవకాశం ఉన్నప్పటికీ తన మొదటి వివాహం ఎక్కువ కాలం నిలవకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు లోనయ్యానని, అందువల్లే అప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించానని తెలిపాడు. కాగా, ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో కోల్ కతా తరపున ఆడిన హాగ్ మూడు వికెట్లు తీసి రాణించాడు. తనకు 50 ఏళ్లు వచ్చేవరకు ఇలాగే ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, హాగ్ ఉత్సాహం చూస్తుంటే 50 ఏళ్ల వరకు ఇలాగే క్రికెట్ ఆడేలానే కనిపిస్తున్నాడు.