: ఫిరాయింపులపై గళం విప్పిన జానా!... సుప్రీంకోర్టుకెళతామని ప్రకటన
పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ కు ‘చేయి’చ్చి గులాబీ కండువా కప్పుకున్న తీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిని బాగానే కలచివేసినట్లుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న మహిళా రాజకీయ నేతగా ఎదిగిన డీకే అరుణ సోదరుడిగా ఉన్న రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ వృద్ధ నేతలను కుదిపేసింది. ఈ క్రమంలో నేటి ఉదయం హైదరాబాదులో గళం విప్పిన జానారెడ్డి... పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో పాటు పార్టీ మారుతున్న కారణాలను వారి నియోజకవర్గాల ప్రజలకు వెల్లడించి మరీ ముందడుగు వేయాలని ఆయన సూచించారు. అయినా పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తూ చేసిన చట్టం... ఇటీవలి కాలంలో అభాసుపాలవుతోందని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. చట్టంలోని కొన్ని లొసుగులను ఆసరా చేసుకుని పలు పార్టీలు ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నాయన్నారు. అయితే ఈ ఉల్లంఘనలను ఇకపై ఎంతమాత్రం సహించబోమని చెప్పిన జానారెడ్డి... ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని పేర్కొన్నారు.