: చంద్రబాబుకు ఉన్న దౌర్భాగ్యమైన రోగం అది!: జగన్ నిప్పులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవసరం వచ్చినప్పుడు ఎవరిపైనైనా భక్తిని చాటుతూ ఫోటోలకు, విగ్రహాలకూ పూలదండలు వేస్తాడని, అవసరం తీరాక ఎస్సీల్లా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని ప్రశ్నిస్తారని వైకాపా అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే చంద్రబాబు, అదే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాస్తూ, ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఆయన అన్యాయం చేస్తున్నాడని... తిరిగి జయంతి, వర్ధంతి దినాల్లో దండలు వేస్తూ, తానే వాళ్లకోసం పోరాటం చేస్తున్నట్టు పోజిస్తాడని, ఇది చంద్రబాబుకు ఉన్న దౌర్భాగ్యమైన రోగమని ఎద్దేవా చేశారు. ఆయన అబద్ధాలు, మోసాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తారన్న అనుమానంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని, విపక్షం లేకుండా చూడాలన్నదే ఆయన ఉద్దేశమని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వాళ్లు లేకుండా చూడాలని భావిస్తున్న ఆయన ఉద్దేశం నెరవేరబోదని జగన్ తెలిపారు.