: పాస్ పోర్టు రద్దు లేఖతో దిగొచ్చిన మాల్యా... సెటిల్ మెంట్ ఆఫర్ ను రూ.6 వేల కోట్లకు పెంచిన వైనం
బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా... చివరకు దిగిరాక తప్పేలా లేదు. ఇప్పటికే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో షాక్ తిన్న మాల్యా... బ్యాంకుల రుణాలను చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లిస్తానని ఆయన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయనకు మొట్టికాయలేసింది. ముందుగా మీ ఆస్తుల విలువెంతో చెప్పడంతో పాటు ఎప్పుడు వస్తారో చెప్పాలంటూ కోర్టు ఆయనకు షాకిచ్చింది. ఐడీబీఐ కేసులో తన ముందుకు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి నిన్న లేఖ రాసింది. ఈ విషయం తెలుసుకున్న మాల్యా వేగంగా స్పందించారు. తన పాస్ పోర్టు రద్దు అయితే మరింత విషమ పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న భావనతో ఉన్న మాల్యా... రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈడీ షాక్ తో బెంబేలెత్తిన మాల్యా... ఇంతకుముందు చేసిన రూ.4 వేల కోట్ల ఆఫర్ కు తాజాగా మరో రూ.2 వేల కోట్లు జోడిస్తూ... మొత్తం సెటిల్ మెంట్ ను రూ.6 వేల కోట్లకు పెంచారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.