: చంద్రబాబు సభలో ఎంపీ మాగంటి అలక!... మైకును విసిరికొట్టి వేదికను దిగిన వైనం!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పోలవరం ముంపు మండలాల పర్యటనలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు సభకు పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే హాజరై అక్కడివారినందరిని ఆశ్చర్యంలో ముంచెత్తగా, అంతకు కాసేపటి ముందు టీడీపీకే చెందిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు అలకబూనారు. అలకతోనే సరిపెట్టని మాగంటి... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విసురుగా వేదిక దిగి, చంద్రబాబు అక్కడికి చేరుకోకముందే వెళ్లిపోయారు. వివరాల్లోకెళితే... తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న చంద్రబాబు సభకు ఉత్సాహంగా వచ్చిన మాగంటి... ముందుగానే వేదికపైకి ఎక్కి హల్ చల్ చేశారు. వేదికపైకి పలువురు నేతలను ఆహ్వానించే క్రమంలో తన నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మాగంటి స్వాగతం పలికారు. అయితే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. వారు వేదిక ఎక్కేందుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న మాగంటి... చంద్రబాబు సభల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పెద్ద పీట వేయడం జరుగుతోందని, వారిని వేదిక మీదకు అనుమతించాలని పదే పదే పోలీసులకు సూచించారు. అయినా పోలీసులు మాగంటి సూచనలను పెడచెవిన పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురైన మాగంటి తన చేతిలోని మైకును నేలకేసి విసిరికొట్టారు. ఆ తర్వాత ఎంపీనైన తనకే విలువ ఇవ్వనప్పుడు ఇక తానెందుకు అక్కడ ఉండాలంటూ విసురుగా వేదిక దిగారు. వేదికను దిగినంత వేగంతోనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 15 నిమిషాలకు చంద్రబాబు అక్కడికి చేరుకున్నా, మాగంటి మాత్రం తిరిగి రాలేదు.

  • Loading...

More Telugu News