: రాజదంపతులు 'దోశమేటిక్'ను లండన్ పంపాలంటూ ఆర్డర్ ఇచ్చారు: 'దోశమేటిక్' రూపకర్త వికాశ్ ఈశ్వర్
బ్రిటన్ రాజదంపతులు తన దోశను రుచి చూడడం ఆశ్చర్యానందాల్లో ముంచెత్తిందని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన మాజీ విద్యార్థి వికాశ్ ఈశ్వర్ (24) తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ముకుంద ఫుడ్స్ వ్యవస్థాపక సీఈవో అయిన వికాశ్ ఈశ్వర్ తన బ్యాచ్ మేట్ సుబీత్ సాబత్ తో కలిసి దోశను తయారు చేసే మెషీన్ ను కనుగొన్నారు. దీనికి 'దోశమేటిక్' అని పేరు పెట్టారు. రాజదంపతుల గౌరవార్థం ఏర్పాటు చేసిన స్టార్టప్ ప్రదర్శనలో పాల్గొన్నారు. అంతకు ముందు ఢిల్లీలో జరిగిన ప్రదర్శనలో తాను దీనిని ప్రదర్శించానని, అయితే అప్పుడు దీని గురించి ఆసక్తిగా తెలుసుకున్న ప్రధాని, ఇప్పుడు దీనిని దూరం నుంచి చూసుకుంటూ వెళ్లారని ఆయన అన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మాత్రం దోశమేటిక్ ను దగ్గర్నుంచి చూసిన బ్రిటన్ ప్రిన్స్, దానిని స్వయంగా వేసుకుని టేస్టు చేశారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తాను ఈ ఆనందంలో ఉండగానే, దోశమేటిక్ ను లండన్ పంపాలంటూ ఆర్డర్ ఇచ్చారని దీనితో తన ఆనందానికి అవధులు లేకుండాపోయాయని ఆయన చెప్పారు. దోశమేటిక్ ను రెండు వర్షన్లలో తయారు చేశానని, రెస్టారెంట్లలో వినియోగించే దాని ధర లక్షన్నర రూపాయలు ఉంటుందని, ఇంటిలో వినియోగించే దాని ధర 12,500 రూపాయలని ఆయన చెప్పారు. దీనికి, అమెరికా, బ్రిటన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.