: ‘బౌద్ధం’ స్వీకరించనున్న రోహిత్ వేముల తల్లి, సోదరుడు
రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు రాజా చక్రవర్తి బౌద్ధ ధర్మం స్వీకరించనున్నారు. రేపు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా వీరిద్దరూ ముంబైలో ఈ ధర్మం స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముంబై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోహిత్ వేముల దళితుడు కావడం వల్లే వివక్షకు గురయ్యాడని, వెలివేయబడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షకు తావు లేని బౌద్ధ ధర్మాన్ని తాము స్వీకరించాలనుకుంటున్నామని అన్నారు. ‘బౌద్ధం’లో అసమానతలకు తావు లేదని భావించినందునే అంబేద్కర్ ఆ ధర్మాన్ని స్వీకరించారన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే తాము పయనిస్తామని వారు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల కొన్ని నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది.