: హిందువు హిందువే... ఆడ హిందువు, మగ హిందువేంటి?: సుప్రీంకోర్టు
హిందూ మతంలోని వారంతా హిందువులేనని, ఆడ హిందువులు, మగ హిందువులు అంటూ తేడాలు లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచప్రసిద్ధ శబరిమల క్షేత్రంలో, బహిష్టు వయసులో ఉన్న ఆడవారి ప్రవేశం నిషిద్ధమన్న అంశంపై వాదనలు కొనసాగగా, సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం, ఏ దేవాలయంలోకీ మహిళలను అనుమతించకుండా ఉండేందుకు వీల్లేదని తెలిపింది. పురుషులకు ప్రవేశమున్న అన్ని ఆలయాల్లోనూ స్త్రీలకు సైతం ప్రవేశం కల్పించాల్సిందేనని పేర్కొంది. అంతకుముందు శబరిమల దేవాలయాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం, కేరళ ప్రభుత్వాలు తమ వాదనను వినిపిస్తూ, శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాలను కొనసాగించాల్సిందేనని సూచించాయి. మహిళా పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు, కోర్టును ఆశ్రయించినందుకు తమ క్లయింట్లను హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు.