: జగన్ నేతృత్వంలో బాబు సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పోరుబాట పడతాం : ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
ఏపీలో కరవు పరిస్థితులపై వైఎస్సార్సీపీ పోరు బాట పట్టనుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడారు. ఏపీలోని తొంభై శాతం గ్రామాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, తాగునీరు కూడా దొరకని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో బాబు సర్కార్ విఫలమైందని, దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, తహశీల్దారు కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నా కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నామన్నారు. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.