: 'కేజ్రీ' ఆలోచన... ఢిల్లీలో లెర్నింగ్ లైసెన్స్ టెస్టు రద్దు!


ఢిల్లీలోని రవాణాశాఖలో జరుగుతున్న అవినీతికి చెక్ చెప్పేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఓ క్రేజీ ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ పరిధిలో లెర్నింగ్ లైసెన్స్ విధానాన్ని తొలగించాలని ఆయన నిర్ణయించారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ అధికారులతో జరిపిన సమావేశంలో కేజ్రీవాల్ తన ఆలోచన అమలు చేద్దామని సూచించగా, గడ్కరీ సైతం మంచి ఆలోచనేనని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. చదువుకున్న వారికి రవాణా నిబంధనల గురించి తెలుసునని, వారికి లెర్నింగ్ లైసెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడగా, కొందరు అధికారులు మాత్రం దీన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. రీజనల్ ట్రాన్స్ పోర్టు కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిందని వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తు చేసిన కేజ్రీవాల్, దరఖాస్తును నింపే సమయం నుంచే ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని తొలగించాలని అన్నారు. "ఇప్పటికిప్పుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. అయితే, అన్ని రకాలుగా ఈ ఆలోచనను పరిశీలిస్తాం. కొంత విద్యార్హతను ప్రాతిపదికగా తీసుకుని దరఖాస్తుదారుడికి లెర్నింగ్ లైసెన్స్ అవసరం లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తాం. గడ్కరీ సైతం విషయాన్ని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు" అని రవాణా శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News