: ప్రేమ కలిపిన ఆ జంటను విడదీయాలంటున్న 'జీహాద్'!
యువతీ, యువకులు పెళ్లి చేసుకుంటామని వచ్చిన వేళ, పూజారి ఎలా ఆపుతాడు?... ప్రాచుర్యంలో ఉన్న ఉర్దూ సామెత ఇది. కర్ణాటకలో మతాంతర వివాహానికి సిద్ధపడ్డ ఓ ప్రేమ జంట అన్ని అడ్డంకులనూ అధిగమించి, తల్లిదండ్రులను ఒప్పించిన వేళ, 'లవ్ జీహాద్' వారిని విడదీయాలని చూస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే... మాండ్యా ప్రాంతానికి చెందిన అషిత (28), షకీల్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ 12 సంవత్సరాలుగా కలిసి చదువుకుంటూ, స్నేహితులుగా ఉన్నారు. తమ బంధాన్ని శాశ్వతం చేసుకునే దిశగా వీరు చేసిన ప్రయత్నాలకు, తల్లిదండ్రుల నుంచి అనుమతి లభించింది. ఈ నెల 17న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలూ నిర్ణయించారు. వీరి ప్రేమ కథ సుఖాంతమైందని అనుకుంటున్నారా? లేదు, అంతలోనే సమస్య మరో రూపంలో ఎదురైంది. బీజేపీ స్థానిక నేతల నేతృత్వంలో కొంతమంది మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో వారి ఇంటి ముందుకు వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. కారణం, అషిత హిందువు, షకీల్ ముస్లిం వర్గానికి చెందిన వారు కావడం. ఓ ముస్లిం యువకుడికి హిందూ యువతిని ఇచ్చి వివాహానికి తాము అంగీకరించబోమని చెబుతూ, ధర్నా నిర్వహించారు. "మేము దిగ్బ్రాంతికి గురయ్యాం. హిందుత్వ కార్యకర్తలు వివాహాన్ని రద్దు చేసుకోమని చెబుతూ ధర్నా చేశారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు వచ్చిన తరువాత వీరు వెళ్లిపోయారు. మా రెండు కుటుంబాలకూ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. పక్కపక్కనే ఉండేవాళ్లం. షకీల్ మంచి అబ్బాయి. అంతకన్నా మంచి వాడిని నేను తేలేను కూడా. అన్నింటికీ మించి మా అమ్మాయి కోరుకుంది. వివాహాన్ని ఎలాగైనా జరిపించాలనే అనుకుంటున్నా" అని అషిత తండ్రి డాక్టర్ నరేంద్ర బాబు వ్యాఖ్యానించారు. దీనిపై హిందూ సంస్థల వాదన మరోలా వుంది. "ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అందువల్లే మేము ఈ పెళ్లిని అడ్డుకోవాలని చూస్తున్నాం" అని స్థానిక బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పరువు హత్యలు పెరిగిన ఈ తరుణంలో తల్లిదండ్రులే దగ్గరుండి మతాంతర వివాహానికి అంగీకరించడంపై మాండ్యా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగే పెళ్లికి అడ్డంకులు రాకుండా సహాయపడతామని చెబుతున్నారు.