: ఒడిశాలో హీట్ ఎమర్జెన్సీ... స్కూళ్లు మూసేస్తున్నట్టు ప్రకటన


ఒడిశాలో భానుడి ప్రతాపం, ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేయగా, ప్రభుత్వం హీట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. పాఠశాలలను ఈ నెల 20 వరకూ మూసివేస్తున్నామని, ఆపై ఎండ తీవ్రతను అనుసరించి ఎప్పుడు తెరుస్తామన్నది నిర్ణయిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత 40 డిగ్రీలను దాటిందని, చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలుగా నమోదైన వేడిమి, కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలను దాటిందని వాతావరణ శాఖ ప్రకటించింది. 1985 ఏప్రిల్ 23న రాష్ట్రంలో 45 డిగ్రీల వేడి నమోదైందని, ఆ తరువాత ఇంతటి ఎండలు కనిపించడం ఇదే తొలిసారని, మరో వారం రోజులు ఈ స్థాయిలోనే ఎండలు వుంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలావుండగా, ఒడిశాలో వీస్తున్న వేడి గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కూడా తాకుతోంది. ఈ ప్రాంతాల్లో ఎండ వేడిమి 44 డిగ్రీలను దాటినట్టు విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News