: బ్యాంకుల చేతికి ‘లగడపాటి’ వ్యాపార సామ్రాజ్యం?
నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న తెలుగు నేలకు చెందిన కంపెనీ ఐవీఆర్ సీఎల్... తదనంతర పరిణామాల్లో బ్యాంకుల చేతిలోకి వెళ్లిపోయింది. నానాటికీ పెరిగిపోతున్న రుణాల భారంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన సదరు కంపెనీని... రుణాలిచ్చిన బ్యాంకులు దాదాపుగా తమ చేతుల్లోకి తీసేసుకున్నాయి. కంపెనీలో ప్రమోటర్లకు చెందిన వాటాలను దక్కించుకున్న బ్యాంకులు కంపెనీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నాయి. ఇలాంటి పరిణామమే బెజవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలోని ‘ల్యాంకో ఇన్ ఫ్రా’కు ఎదురు కానుంది. సదరు కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పటికే ఈ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సారధ్యంలో బ్యాంకుల కన్సార్టియం ల్యాంకో ఇన్ ఫ్రాకు పెద్ద మొత్తంలో రుణాలచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న ల్యాంకో ఆ తర్వాత రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో బకాయిల మొత్తం రూ.39,980 కోట్లకు చేరింది. విజయ్ మాల్యా వ్యవహారం నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో ఐసీఐసీఐ... ల్యాంకో నుంచి రుణాలను రాబట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ల్యాంకో గ్రూపులోని విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టేందుకు కార్యాచరణను రూపొందించింది. ఇందులోని లగడపాటి కుటుంబానికి ఉన్న మెజారిటీ వాటాలను చేజిక్కించుకుని, సదరు కంపెనీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తాను రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఆ బ్యాంకు... ల్యాంకో ప్రతినిధులకు వివరించింది. ఈ మేరకు బ్యాంకులు తమ ముందు ఈ ప్రతిపాదనను పెట్టాయని ల్యాంకో కూడా ధ్రువీకరించింది. సుమారు 8,000 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న విద్యుత్ విభాగానికి సంబంధించి హోల్డింగ్ స్థాయిలో గానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది.