: జీహెచ్ఎంసీ సర్క్యులర్ పై మండిపడుతున్న మహిళా కార్పొరేటర్ల భర్తలు
ప్రజా సమస్యల పరిష్కారం, అధికారులతో సంప్రదింపులు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వంటి వ్యవహారాల్లో మహిళా కార్పొరేటర్ల భర్తలు జోక్యం చేసుకోవద్దంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ఇప్పుడు మహిళా కార్పొరేటర్ల భర్తలు మండిపడుతున్నారు. ఇలా సర్క్యులర్ జారీ చేయడం సబబు కాదని, తమ భార్యలు హాజరు కాలేని ప్రత్యేక పరిస్థితుల్లో తాము సంబంధిత అధికారులను సంప్రదించక తప్పదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తామే తప్ప, అధికారుల విధి నిర్వహణలో జోక్యం చేసుకోమని పాతబస్తీలోని మహిళా కార్పొరేటర్ల భర్తలు అంటున్నారు. కాగా, ఈ విషయమై ఈ నెల 6వ తేదీన జీహెచ్ఎంసీ ఒక సర్క్యులర్ (నంబర్-236/ఎంఎస్/జీహెచ్ఎంసీ/2016/64) జారీ చేసింది. ఈ సర్క్యులర్ ను అన్ని జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లకు పంపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా కార్పొరేటర్లు మాత్రమే తమ వార్డు సమస్యలపై అధికారులను సంప్రదించాలని, వారి భర్తలు జోక్యం చేసుకోవద్దని ఆ సర్క్యులర్ లో సూచించారు. జీహెచ్ఎంసీ దక్షిణ మండలం పరిధిలోని ఘాన్సీ బజార్, గౌలిపురా, సైదాబాద్, ఐఎస్ సదన్, కుర్మగూడ, ఫలక్ నుమా, నవాబ్ సాబ్ కుంట, మూసారాం బాగ్, ఓల్డ్ మలక్ పేట్, ఆజంపురా, మొఘల్ పురా, తలాబ్ చంచలం, కంచన్ బాగ్, బార్కస్, సులేమాన్ నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ మొదలైన మున్సిపల్ డివిజన్ల నుంచి మహిళా కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.