: నేను చేస్తున్న పోరాటం గెలిచింది: సునీతా కృష్ణన్
మహిళలు, యువతులు తమలో లోపాలను గుర్తించి, పరిష్కారాలను తమకు తామే కనుగొన్నప్పుడే మహిళల అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రముఖ సామాజిక కార్యకర్త, సునీతా కృష్ణన్ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘పద్మశ్రీ పురస్కారం నాకు వచ్చిందనే విషయం తెలియగానే చాలా ఆశ్చర్యపోయాను. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు గాను నేను చేస్తున్న పోరాటం గెలిచింది. ఈ పురస్కారంతో ప్రభుత్వం నా పోరాటాన్ని గుర్తించింది. మహిళల అక్రమ రవాణాకు పేదరికం మాత్రమే కారణం కాదు, విద్య, ఉపాధి లేకపోవడం కూడా కారణాలే. మధ్య తరగతి మహిళలు అందం, ప్రేమ పేరుతో మోసపోతున్నారు. మహిళలు, యువతులను నేరగాళ్లు నిశితంగా పరిశీలిస్తుంటారు. మహిళల్లో బలహీనతలను, అవసరాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణాకు గురవుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో 30 లక్షల మంది మహిళలు అక్రమ రవాణా బాధితులు. అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేవలం 7 శాతం మాత్రమే. నేను చేస్తున్న పోరాటం సరైన పద్ధతిలో ఉందని చెప్పడానికి సంకేతాలు నాపై జరిగిన దాడులు. 1996లో 'ప్రజ్వల' అనే సంస్థను స్థాపించాము. జీవితాంతం ‘ప్రజ్వల’ను నడిపించడానికి నాకు ఇష్టం లేదు. ఏ రోజు ఏ అమ్మాయి అమ్ముడుపోదో, ఆరోజు నాకు, నా సంస్థకు పని లేదు. అట్లాంటి రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను. తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ఎక్కువ శాతం సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, అరబ్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు’ అని సునీతా కృష్ణన్ పేర్కొన్నారు.