: స్మార్ట్ ఫోన్ నే బ్యాంకుగా మార్చేసిన 'యూపీఐ'... ఎలా వాడుకోవచ్చంటే..!
కేవలం సోషల్ మీడియాలో పోస్టింగులు, సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా, దైనందిన జీవితంలో స్మార్ట్ ఫోన్లను మరింత భాగం చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) పేరిట ఓ మెగా యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్లో ఉంటే, వివిధ రకాల చెల్లింపులు, నగదు బట్వాడా మరింత సులువుగా మారి ఎంతో సమయం ఆదా అవుతుంది. ఈ యాప్ ను వాడుకుంటూ గరిష్ఠంగా రూ. లక్ష లావాదేవీలను క్షణాల్లో జరుపుకోవచ్చు. రూ. 50 మొబైల్ రీచార్జ్ కూడా మునివేళ్లతో చేసేసుకోవచ్చు. ఈ యాప్ వల్ల ప్రధాన ప్రయోజనం ఏంటంటే, థర్డ్ పార్టీ చెల్లింపులు. ప్రస్తుతం థర్డ్ పార్టీ చెల్లింపులు చేయాలంటే, డబ్బు పంపాలనుకున్న వ్యక్తిని ఆన్ లైన్ లో యాడ్ చేసుకోవాలి. సదరు వ్యక్తి బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్, శాఖ వివరాలు తెలిసుండాలి. యూపీఐ యాప్ లో అవేమీ అవసరం ఉండవు. మీకు తెలియాల్సింది ఏంటంటే, డబ్బు రిసీవ్ చేసుకునే వ్యక్తి యునీక్ ఐడీ మాత్రమే. యునీక్ ఐడీని ఎంటర్ చేసి, 'సెండ్' పై క్లిక్ చేసి, మొబైల్ పిన్ ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు చేసేసుకోవచ్చు. రెగ్యులర్ చెల్లింపు విధానంతో పోలిస్తే, ఈ విధానం చాలా సులువు. ఓ కూల్ డ్రింక్ షాపుకు వెళ్లి డ్రింక్ తాగి కూడా యూపీఐతో డబ్బులు అక్కడికక్కడే కట్టేసి రావచ్చు. ఈ యాప్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా నగదు లావాదేవీలను గణనీయంగా తగ్గించవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. కాగా, మార్చి 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1.96 కోట్ల లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ విధానంలో జరుగగా, రూ. 16,885 కోట్లు చేతులు మారాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక 2015-16లో ఫిబ్రవరి వరకూ అందుబాటులోని గణాంకాల ప్రకారం, 4.27 కోట్ల లావాదేవీల్లో రూ. 46,473 కోట్లు చేతులు మారాయి. కస్టమర్ యూపీఐని ఎలా వాడుకోవచ్చంటే... * మొదట మీకు బ్యాంకులో ఖాతా, ఓ స్మార్ట్ ఫోన్ ఉండాలి. * ఆపై ప్లేస్టోర్ నుంచి యూపీఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. * దాని ద్వారా సులువుగా బ్యాంకు ఖాతాకు కనెక్ట్ కావచ్చు. * ఆపై మీకు మాత్రమే పరిమితమైన యునీక్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. * ఓ మొబైల్ పిన్ ను సృష్టించుకుని, ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలి. ప్రస్తుతం యూపీఐ సేవలను అందించేందుకు 10 బ్యాంకులు అంగీకరించాయి. మిగతా బ్యాంకులు నేడో, రేపో ఈ యాప్ తో జతకట్టడం ఖాయంగా కనిపిస్తోంది.