: పార్టీ మారితే మంత్రి పదవిస్తామన్నారు!... టీడీపీ ‘ఆకర్ష్’పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య
ఏపీలో జోరుగా సాగుతున్న అధికార పార్టీ టీడీపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’పై వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఫైరయ్యారు. పార్టీ మారితే తనకు దక్కే తాయిలాలను తెలుపుతూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఈ మేరకు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గంలోని కొయ్యూరులో నిన్న పార్టీ మండల స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె... పార్టీ మారితే తనకు మంత్రి పదవిస్తామన్నారని ఆరోపించారు. మంత్రి పదవితో పాటు కోట్లాది రూపాయలను ముట్టజెప్పేందుకు సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబునాయుడే సిద్ధపడ్డారని ఆమె ఆరోపించారు. ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని ఆమె తేల్చిచెప్పారు. కడదాకా తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే నడుస్తానని ఆమె ప్రకటించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం తాను ఏకంగా సీఎంతోనే పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు.