: ఆధార్ ఎన్ రోల్ మెంట్ లో నిలేకని సొంత స్టేట్ వెనుకంజ!
కర్ణాటక... ఐటీలో దేశంలోనే మేటి రాష్ట్రం. ఈ కారణంగానే ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరు... భారత సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకుంది. ఐటీలో ఏ మేర వృద్ధి సాధిస్తేనేం.. ఆధార్ ఎన్ రోల్ మెంట్ లో మాత్రం ఆ రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఆధార్ కార్డులకు రూపకల్పన చేసిన ప్రముఖ సాఫ్ట్ వేర్ నిపుణుడు నందన్ నిలేకని కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారే. ఆధార్ కార్డుల ఎన్ రోల్ మెంట్ ఇటీవల వంద కోట్ల మార్కును తాకింది. ఈ సందర్భంగా ఏ రాష్ట్రంలో ఎంతమేర మందికి ఆధార్ కార్లులు అందాయన్న లెక్కలు తీయగా, ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈ జాబితాలో దాదాపు నూరు శాతం మేర ఆధార్ ఎన్ రోల్ మెంట్ నమోదైన దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇప్పటిదాకా 84.4 శాతం మందికి ఆధార్ కార్డులివ్వగలిగిన కర్ణాటక మాత్రం 17వ స్థానానికి పడిపోయింది. 2014లో కర్ణాటక 14వ స్థానంలో నిలవగా, తాజాగా మరో మూడు స్థానాలు కోల్పోయి 17వ స్థానానికి పడిపోయింది.