: టీమిండియాకు వ్యతిరేకంగా 'కామెంట్'రీ చేసి మూల్యం చెల్లించుకున్న హర్షా భోగ్లే!
క్రికెట్ వ్యాఖ్యాతగా దాదాపు 20 సంవత్సరాల అనుభవమున్న హర్షా భోగ్లేను కామెంటేటరీ టీం నుంచి తప్పించిన ఘటన భారత క్రికెట్ వర్గాల్లో కొంత కలకలాన్నే రేపింది. బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక, ఈ మొత్తం వ్యవహారంలో భారత ఆటగాళ్ల పాత్రతో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం తన వంతు పాత్రను పోషించాడు. వరల్డ్ కప్ టీ-20 పోటీల్లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న వేళ, కామెంటేటర్ గా ఉన్న హర్షా భోగ్లే, బంగ్లాకు అనుకూల వ్యాఖ్యలు చేశారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన అభియోగం. దీనిపై అమితాబ్ సైతం అసహనాన్ని వ్యక్తం చేశారు. మార్చి 23న అమితాబ్ తన సామాజిక మాధ్యమాల ద్వారా "ఓ ఇండియన్ కామెంటేటర్ ఎప్పుడూ ఇతర దేశాల ఆటగాళ్ల గురించి మాట్లాడటం బదులు, మనవారి గురించి మాట్లాడితే బాగుంటుంది" అని ట్వీట్ చేయగా, దీనికి ధోనీ సహా పలువురు క్రికెటర్లు మద్దతు పలికారు. అమితాబ్ వ్యాఖ్యలు నిజమని చెబుతూ, "ఈ మాటలకు ఇంకేం కలపాల్సిన అవసరం లేదు" అని ధోనీ రీ ట్వీట్ చేశాడు. ఇక క్రీడాభిమానుల నుంచి కూడా హర్షా భోగ్లే వైఖరిపై విమర్శలు తలెత్తడంతో, ఐపీఎల్ సీజనులో ఆయన సేవలను వినియోగించుకోరాదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇక ఇప్పుడు క్రికెట్ కామెంటేటర్లు తప్పనిసరిగా దేశ ఆటగాళ్లకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాలా? అన్న చర్చ మొదలైంది. ఏదిఏమైనా, ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి వ్యాఖ్యాతగా సేవలందిస్తున్న హర్షా, ఒక్క మ్యాచ్ లో చేసిన వ్యాఖ్యలతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. ఇక తిరిగి అతన్ని తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.