: గతంలో తాము అణుబాంబు వేసిన ప్రదేశానికి వెళ్లనున్న ఒబామా!


అమెరికా అధ్యక్ష పదవికి మరికొన్ని నెలల్లో గుడ్ బై చెప్పనున్న బరాక్ ఒబామా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో అమెరికా అణుబాంబులు వేసిన హిరోషిమాలో పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. అదే జరిగితే, అణుబాంబు ధాటికి నామరూపాల్లేకుండా పోయి ఆపై సగర్వంగా తలెత్తుకు నిలబడ్డ హిరోషిమాలో పర్యటించే తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అవుతారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ, పెరల్ హార్బర్ విధ్వంసం తరువాత, అమెరికా యుద్ధ విమానాలు జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఆపై దశాబ్దాల పాటు జపాన్ తో సత్సంబంధాలు నెరపడంలో విఫలమైన యూఎస్, నెమ్మదిగా ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒబామా అక్కడికి వెళుతున్నారు. ఒబామా జపాన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అమెరికా ఆయుధ నియంత్రణ విభాగం కార్యదర్శి రోజ్ గోటెమొల్లర్ తెలిపారు. ఈ వారంలో జాన్ కెర్రీ జపాన్ లో పర్యటిస్తారని, హిరోషిమాలోని పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి నివాళులు అర్పిస్తారని ఆయన వివరించారు. ప్రపంచంలో అణ్వస్త్రాన్ని వాడి, దాని శక్తిని చూసిన అమెరికా, అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం ముందుండి కృషి చేస్తుందని గతంలో ఒబామా ప్రసంగించిన సంగతి తెలిసిందే. కాగా, అణ్వాయుధాలపై ఒబామా వైఖరి ఇలావుండగా, తదుపరి అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే, అణుబాంబులు వేసేందుకు ఎంతమాత్రమూ సందేహించబోనని ఆయన ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News