: ఈ ప్లాన్ విజయవంతమైతే పాక్ నుంచి ఒక్క ఉగ్రవాదీ చొరబడలేడట!
పాకిస్థాన్ నుంచి భారత్ లోని సరిహద్దుల గుండా చొరబడుతూ, ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారిని అరికట్టడమే లక్ష్యంగా ఆధునిక టెక్నాలజీని నమ్ముకోవాలని భారత్ భావిస్తోంది. ఈ ప్లాన్ విజయవంతమైతే ఒక్కడు కూడా పాక్ వైపు నుంచి ఇండియాలోకి రాలేడని, ఇందులో భాగంగా 2,900 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దులను పరిరక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సరిహద్దులపై నిఘా ఉంచేందుకు ఐదంచెల వ్యవస్థను 'సీఐబీఎంఎస్' (కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్ మెంట్ సిస్టమ్)ను ఏర్పాటు చేయడం ద్వారా అనుక్షణం సరిహద్దులను కాపాడవచ్చని భద్రతాదళాలు, రక్షణ శాఖ అధికారులు కొత్త ప్రణాళిక అమలుకు కదిలారు. సరిహద్దుల వెంట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, నైట్ విజన్ పరికరాలు, రాడార్లు, లేజర్ కిరణాలతో కూడిన అడ్డుగోడలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు ఓ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏర్పాట్లు పూర్తయితే, చొరబాటుకు యత్నించినప్పుడల్లా క్షణాల్లో సమాచారం అందుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం భారత్, పాక్ సరిహద్దుల్లోని పర్వతాలు, నదుల పరిసరాల్లో 130 చోట్ల ఫెన్సింగ్ లేని ప్రాంతాలున్నాయి. వీటిని అలుసుగా తీసుకుంటున్న ఉగ్రవాదులు సులువుగా భారత్ లోకి చొరబడుతున్నారు.