: సిద్దిపేటలో టీఆర్ఎస్ కు షాక్!... మూడు వార్డుల్లో స్వతంత్రుల జయకేతనం!
కంచుకోట లాంటి సిద్దిపేటలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. నేటి ఉదయం ప్రారంభమైన సిద్దిపేట మునిసిపల్ ఓట్ల లెక్కింపులో ఆ పార్టీకి షాకిస్తూ మూడు వార్డులను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుల సొంతూరైన సిద్దిపేటలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం పెద్ద వార్తే. గడచిన మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్... తనకు కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోవడం గమనార్హం. కడపటి వార్తలు అందేసరికి మొత్తం 10 వార్డుల ఫలితాలు వెలువడగా... ఆరో వార్డును కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక మూడో వార్డులో సంధ్య, నాలుగో వార్డులో దీప్తి, ఐదో వార్డులో స్వప్న విజయం సాధించారు. వీరు ముగ్గురూ స్వతంత్రం అభ్యర్థులే. మిగిలిన ఆరు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.