: చంద్రబాబు 'విజన్' భేషుగ్గానే ఉంది!... పరీక్షల్లో నిర్ధారించిన ‘ఎల్వీ ప్రసాద్’ వైద్యులు
వయసు మీద పడుతున్నా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కంటి చూపు ఏమాత్రం తగ్గలేదు. ఈ మేరకు నిన్న చంద్రబాబు కళ్లను పరీక్షించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు తేల్చారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఉన్న ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లారు. హైదరాబాదు నుంచి వెళ్లిన కంటి వైద్య నిపుణులు చంద్రబాబుకు కంటి పరీక్షలు చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఆసుపత్రిలోనే ఉన్న చంద్రబాబు... వైద్యులు చేసిన అన్ని పరీక్షలకు ఓపికగా సహకరించారు. ఆ తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలో కలియదిరిగిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన పచ్చదనాన్ని మెచ్చుకున్నారు. ఇక చంద్రబాబు వెంట ఆసుపత్రికి వెళ్లిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు.