: స్టైలిష్ స్టార్ అంటారని సూటేసుకొచ్చా... అదేమో తడిసిపోయింది: అల్లు అర్జున్
'ఈ వెదర్ కి సూట్ కాకపోయినా స్టైలిష్ స్టార్ అంటారని సూటేసుకొచ్చా...అదేమో తడిసిపోయింది' అన్నాడు అల్లు అర్జున్. తమన్ మనిషి ఎంత సాలిడ్ గా ఉంటాడో, అతని మ్యూజిక్ కూడా అంతే సాలిడ్ గా ఉందని చెప్పాడు. కెమెరామేన్ రిషీ పంజాబీ లేకుండా ఈ సినిమాను ఊహించలేనని అల్లు అర్జున్ అన్నాడు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దీని ఆడియో వేడుక వైజాగ్ లో చేయాలని అనిపించేదని, అంత బలమైన కోరిక ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందని అల్లు అర్జున్ తెలిపాడు. ఆర్య షూటింగ్ చేసినప్పుడు ఆర్కే బీచ్ మధ్యలో ఆడియో వేడుక జరపాలని కోరుకున్నానని, ఆ ఆడియో వేడుక కోరిక ఇప్పుడు నెరవేరిందని బన్నీ అన్నాడు. ఈ సినిమాలో ఈ పాత్రను అంగీకరించిన శ్రీకాంత్ అన్నయ్యకు ధన్యవాదాలు అని చెప్పాడు. ఇతర రాష్ట్రాల్లో పెద్ద హీరోగా చేస్తూ ఇందులో ఆది పని చేయడం గ్రేట్ అని అన్నాడు. ఆది తన చిన్ననాటి స్నేహితుడని తెలిపిన అల్లు అర్జున్, తన స్నేహితుడిని దీవించాలని కోరాడు. 'రకుల్ ఎంత అందగత్తో అంత తెలివైనది, ఎంత తెలివైనదో అంత మంచి అమ్మాయి. ఆమెకు విజయం సాధించాలి. కేథరీన్ ట్రేసా షూటింగ్ ఉండడంతో రాలేకపోయింది. అంజలికి ధన్యవాదాలు. బోయపాటి హీరోను బట్టి ఇమేజ్ డిజైన్ చేస్తాడు' అని చెప్పాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఊరమాస్ ఫ్యామిలీ సినిమా అని చెప్పాడు. గీతా ఆర్ట్స్ లో తాను చేస్తున్న మూడో సినిమా అని అన్నాడు. తన సినిమా అంటే ఈ నిర్మాత ప్రతి రూపాయికి మరో మూడు రూపాయలు ఎక్కువ పెడతాడని, కొడుక్కి పెట్టకపోతే ఎవరికి పెడతారని చమత్కరించాడు. తనను పెద్ద స్టార్ ని చేసేందుకు తన తండ్రి చాలా కష్టపడుతున్నారని అల్లు అర్జున్ చెప్పాడు. తాము కార్లలో తిరిగే వారమని, తాము తిరిగేందుకు రోడ్డెసిన వ్యక్తి చిరంజీవి గారని అల్లు అర్జున్ తెలిపాడు.