: సుజనాను పదవిలో ఎలా కొనసాగిస్తున్నారు?: మోదీకి రఘువీరా సూటి ప్రశ్న
అవినీతిని అంతం చేస్తానని బీరాలు పలికి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని ఎలా కొనసాగిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రధానిని ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, మారిషస్ బ్యాంకుకు ఎగనామం పెట్టిన కేసులో నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన తరువాత కూడా ప్రధాని, టీడీపీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. దీని ద్వారా బీజేపీ, టీడీపీ రెండు పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని అర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సుజనా ద్వారా టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు లాభపడి ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సుజనాను తక్షణం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.