: మీ రోజుని నిర్దేశించేది ఆ అల‌వాటే... నిద్రలోంచి మేల్కోగానే మీ దిన‌చ‌ర్య‌ని ఇలా పాటించి చూడండి!


హడావిడిగా నిద్రలేవడం ఆపై 'జీవిత భారాన్ని మోసే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేయాలి' అనేలా ప‌నులు ప్రారంభించ‌డం.. మ‌నంద‌రికీ అల‌వాటే. అయితే మ‌నం నిద్ర‌లేచే వేళ ఉండే మానసిక స్థితే మ‌నం ఆ రోజులో చేయ‌బోయే ప‌నుల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని మాన‌సిక నిపుణులు అంటున్నారు. తూర్పునుంచి వెలుగు రేఖలు వెద‌జ‌ల్లుతూ సూర్యుడు మ‌న‌కు గుడ్ మార్నింగ్ చెప్తాడు. అటువంటి ఉత్సాహ‌వంత‌మైన వెలుగునే మీ మ‌న‌సులో నింపుకోండి. సాఫీగా సాగాల్సిన మ‌న రోజుని చికాకుగా, బ‌ద్ధ‌కంగా ప్రారంభిస్తే లాభం లేదు. నిత్యకృత్యమైన పనులు సైతం సరిగా చేసుకోలేము. రోజూ రోజూ క‌లిస్తేనే నెల‌, సంవ‌త్స‌రం అవుతాయి. మ‌న జీవిత కాలాన్నంతా మాన‌సిక ఒత్తిడి లేకుండా గ‌డ‌పాలంటే ప్ర‌తీరోజు ఉద‌యాన్నే ఉత్సాహంగా ఉండేట‌ట్లు మీ జీవ‌న విధానాన్ని మార్చుకోండి. పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్‌ చెక్‌ చేసుకోవడం వంటి అల‌వాట్లు కొన్నిసార్లు మూడ్‌ని బాగా పాడుచేసే అవకాశం ఉంది. ఇవి క‌ట్టిపెట్టి నిద్ర‌లేవ‌గానే ఓ జోక్ చ‌ద‌వ‌డం, అద్దంలో మీ ముఖం చూసుకొని బ‌ల‌వంతంగానైనా 20సెక‌న్లు న‌వ్వ‌డం, మీ ఇంట్లో వారికి గుడ్ మార్నింగ్ చెప్ప‌డం వంటివి చెయ్యండి. నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాస‌క్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది. రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. తర్వాత గ్రీన్‌ టీ లాంటిది తీసుకుంటే మంచింది. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శ‌రీరాన్ని స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. మ‌న‌కు కొండంత ఎన‌ర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయని వైద్యుల వాద‌న‌. ప్ర‌తీరోజు నిద్ర‌లేచే స‌మ‌యం క‌న్నా మ‌రో గంట ముందుగా నిద్రలేచే అల‌వాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవ‌డం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయ‌డం మీ అల‌వాట్లో లేక‌పోతే, ఆ అల‌వాటును అల‌వ‌రుచుకోండి. ఆహ్లాదక‌రంగా సంపూర్ణంగా రోజును గ‌డ‌పాల‌నుకుంటే ఉద‌యం పూట మెలోడీ సంగీతం వినడం మంచిది. సంగీతం మ‌న‌లో స్తబ్ధ‌తని పోగొడుతుంది. ర‌ణ‌గొణ ధ్వ‌నుల్లా ఉండే సంగీతం కాకుండా మ‌నసుకి ప్ర‌శాంత‌త చేకూర్చే మీకిష్టమైన సంగీతం మాత్ర‌మే వినండి. మ‌న మూడ్ రొటీన్‌గా ఉండ‌కుండా సంగీతం సాయం చేస్తుంది.

  • Loading...

More Telugu News