: మీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు సహకరిస్తాం: అమెరికా
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు భారత్-పాకిస్థాన్ ప్రత్యక్ష చర్చలు జరిపే అంశంపై ఆ దిశగా తమ దేశం ప్రోత్సహిస్తుందని అమెరికా అధ్యక్షుడి పరిపాలనా విభాగం తెలిపింది. భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలు జరిపితే ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ మీడియా సమావేశంలో తెలిపారు. చర్చలతో ఇరు దేశాలు పరస్పరం ఆచరణాత్మక సహకారం పొందగలుగుతాయని పేర్కొన్నారు. ఆ దిశగా భారత్-పాక్ చర్చలు జరిపేందుకు అమెరికా నుంచి పూర్తి సహకారం అందుతుందని అన్నారు. కాగా, గూఢచారిగా అనుమానిస్తూ బెలోచిస్థాన్‌లో ఇండియన్‌ను అరెస్ట్ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆ విషయమై పూర్తి వివరాలు తమకు ఇంకా తెలియవని అన్నారు.