: ఘాటు సమాధానంతో రిపోర్టర్ కు షాకిచ్చిన సురేశ్ రైనా!
టీమిండియా కీలక ఆటగాడు సురేశ్ రైనా... ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. రెగ్యులర్ గా కాకపోయినా, అడపాదడపా బ్యాటు ఝుళిపిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఇఫ్పుడప్పుడే అతడు జట్టుకు దూరమయ్యే పరిస్థితి లేదు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సిరీస్ లో అతడు కొత్త జట్టు గుజరాత్ లయన్స్ కు కెప్టెన్ గానూ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో అతడి ఫామ్ పై సందేహాలు రేకెత్తేలా ఓ ప్రశ్న సంధించిన ఓ విలేకరికి రైనా కూడా గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చాడు. అసలేం జరిగిందంటే... ఐపీఎల్ తాజా సిరీస్ ఆరంభమవుతున్న క్రమంలో నిన్న న్యూఢిల్లీలో రైనాకు ఓ రిపోర్టర్ ఓ వింత ప్రశ్న సంధించాడు. ‘‘మీరు టీమిండియాకు కోచ్ గా గానీ, లేదా ఏదో ఒక నేషనల్ టీంకు కోచ్ గా వ్యవహరిస్తారంటూ వార్తలొస్తున్నాయి. మీరు ప్లేయర్ గా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? కోచ్ గా కంఫర్ట్ గా ఉంటుందని భావిస్తున్నారా?’’ అని పొంతన లేని ప్రశ్నను రిపోర్టర్ సంధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైనా... ‘‘మీ ప్రశ్న ఎలా ఉందంటే... మీరు భార్యతో కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? లేదా మరెవరితోనైనా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? అన్నట్టుగా ఉంది. 11 ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్నాను. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. బీసీసీఐ నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా’’ అని రైనా చెప్పిన సమాధానంతో ఆ రిపోర్టర్ షాక్ తిన్నాడట.