: బాలయ్య ‘సెంచరీ’ సినిమా ప్రకటన నేడే!... అమరావతిలో భారీ ఏర్పాట్లు
టాలీవుడ్ అగ్ర హీరో, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించనున్న 100వ చలన చిత్రానికి సంబంధించిన ప్రకటన నేడు విడుదల కానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తన వందో చిత్రం ప్రకటనకు సంబంధించి బాలయ్య అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్న సంస్థ నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భారీ ఏర్పాట్లు చేసింది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రానికి సంబంధించిన దాదాపుగా అన్ని వివరాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులే కాక, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో ఈ ప్రకటన పట్ల ఆసక్తి నెలకొంది.