: బెజవాడలో చంద్రబాబు సెల్ రిమోట్ నొక్కితే... ‘తూర్పు’ గూడెంలో మోటార్ స్టార్టయింది!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... నిజంగా హైటెక్ ముఖ్యమంత్రే. ఏ పని చేసినా ఆయన అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఈ తరహాలో టెక్నాలజీని వినియోగించుకుని అందరినీ అబ్బురపరిచారు. ఈ క్రమంలో నిన్న ఆయన విజయవాడలో మరోసారి ఈ తరహా ప్రయోగం చేసి, సక్సెస్ అయ్యారు. వివరాల్లోకెళితే... విద్యుత్ పొదుపుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు చంద్రబాబు సంకల్పించారు. ఈ క్రమంలో ఎనర్జీ ఎఫీసియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ రూపొందించిన సరికొత్త విధానాన్ని నిన్న ఆయన విజయవాడలో ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో ఉండి సెల్ రిమోట్ స్విచ్ నొక్కగానే... ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెంలో సదరు సంస్థ ఏర్పాటు చేసిన బోరుబావి మోటార్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో విజయవాడలో ఉన్న చంద్రబాబు మీట నొక్కగానే తన పొలంలో ఏర్పాటు చేసిన మోటారు పంపులో నుంచి నీరు రావడంతో గూడేనికి చెందిన రైతు ఏడుకొండలుతో పాటు గ్రామానికి చెందిన ఇతర రైతులు, కంపెనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.