: విదేశాల్లో ఆడంబరమైన ప్రకటనలు...స్వదేశంలో విద్వేషాలు: సోనియా విమర్శలు
విదేశాల్లో ఆడంబరమైన ప్రకటనలు గుప్పించే ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశంలో మాత్రం విద్వేషాలు రేపుతున్నారని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా బార్పేట జిల్లా సరుఖేత్రిలో ఆమె మాట్లాడుతూ, నాగ్ పూర్ కేంద్రంగా బీజేపీ మతతత్వ కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అస్సాం ఓటర్లు దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. శంకర్ దేవా, ఆజాన్ ఫకీర్ బోధనలు పాటిస్తూ తళుకులీనుతున్న అస్సాం సామరస్యానికి ప్రతీక అని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ, ఆయన మంత్రి వర్గ సహచరులు దేశం మొత్తం పర్యటిస్తూ అసత్య వాగ్దానాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకం చేసే పార్టీ అయితే, బీజేపీ అందరినీ విడదీసే పార్టీ అని ఆమె తెలిపారు.