: చండీగఢ్‌లో కారు పార్కింగ్ గొడవ.. ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న వ్యక్తి!
ఎమ్మెల్యేతో సాధారణ వ్యక్తులెవరైనా గొడవ పెట్టుకుంటారా..? చండీగఢ్‌లో ఓ వ్యక్తి అదే పనిచేశాడు. అంతేకాదు, ఏకంగా ఎమ్మెల్యేనే కొట్టేశాడు. అక్కడి సెక్టార్ 9 ప్రాంతంలో కారు పార్కింగ్ విషయంలో గొడవ పడి జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్‌పై కమల్‌జీత్‌సింగ్ అనే వ్యక్తి చేయిచేసుకున్నాడు. పార్కింగ్ నుంచి తన కారును బయటకు తెచ్చుకోవడానికి సదరు ఎమ్మెల్యే కమల్‌జీత్ కారును పక్కకు తీయమని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కమల్‌జీత్ సింగ్ ఎమ్మెల్యేపై దాడికి దిగాడు. ఘటనపై ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కమల్‌జీత్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు.