: తాగకపోతే పిచ్చెక్కుతోందట... మద్యనిషేధం నేపథ్యంలో బీహార్ 'మందుబాబు'ల వింత ప్రవర్తన!
బీహారులో మద్య నిషేధం మందుబాబుల ప్రాణాలకు ముప్పు తెచ్చింది. నిత్యమూ మద్యం మత్తులో తూగుతుండే వారంతా, మందు దొరక్క వింత చేష్టలకు పాల్పడుతున్నారు. బీహారులో మద్య నిషేధం అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 749 మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో చాలా మంది తమ కుటుంబ సభ్యులను గుర్తించడంలో విఫలమవుతున్నారని, మత్తు కోసం సబ్బులను తిన్నవారున్నారని రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. రోజుకు 600 నుంచి 1200 ఎంఎల్ దేశవాళీ మద్యాన్ని తాగే అలవాటున్న 30 ఏళ్ల వ్యక్తి మరింత వింతగా ప్రవర్తిస్తున్నాడని ఔరంగాబాద్ డీ అడిక్షన్ సెంటర్ ఆఫీసర్ ఆర్కే సింగ్ తెలిపారు. చాలామంది పెద్దమొత్తంలో కాగితాలను తింటున్నారని, పెయిన్ కిల్లర్ ఔషధాలను తీసుకుంటున్నవారి సంఖ్యా అధికంగా ఉందని పాట్నాలోని నలందా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అధికారులు తెలిపారు. నిత్యమూ మద్యం తాగే అలవాటున్న ఓ బాలుడు, చేతికి ఏది దొరికితే దాన్ని తింటున్నాడని, మంగళవారం నుంచి అతని ప్రవర్తన మరింత వింతగా మారిందని తెలిపారు. అయితే, ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించామని బీహార్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆసుపత్రుల్లో చేరిన వారిలో 96 మందికి తాత్కాలికంగా ఇంజక్టబుల్ డ్రగ్స్ ఇచ్చామని, అందరినీ మద్యం అలవాటు నుంచి దూరం చేయగలమని ఎస్ హెచ్ఎస్బీ అధికారి తెలిపారు.